పాన్ ఇండియా దర్శకుడు నాగ్ అశ్విన్ తన బ్లాక్‌బస్టర్ సినిమా ‘కల్కి 2898 AD’పై వస్తున్న విమర్శలకు తొలిసారి స్పందించారు. ఇటీవల విడుదలైన అఖిల్ అక్కినేని ‘లెనిన్’ సినిమాలో కర్ణుడి పాత్రకు ప్రశంసలు రావడంతో, కొందరు నెటిజన్లు ‘కల్కి 2898 AD’లో కర్ణుడి పాత్ర చిత్రీకరణను విమర్శించారు. కర్ణుడిని అతిగా గ్లోరిఫై చేశారని, మహాభారతానికి భిన్నంగా చూపించారని సోషల్ మీడియాలో చర్చ సాగింది.
ఈ నేపథ్యంలో నాగ్ అశ్విన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, ప్రముఖ రచయిత, ఆర్థికవేత్త వివేక్ దేబ్‌రాయ్ ఆంగ్లంలో అనువదించిన మహాభారతంలోని ఒక పేజీని షేర్ చేశారు. అది ద్రోణ వధ పర్వంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పిన మాటలని పేర్కొంటూ, “దయచేసి మహాభారతం చదవండి. ముఖ్యంగా వివేక్ దేబ్‌రాయ్ అనువాదాన్ని చదవాలని సూచిస్తున్నాను. శ్రీకృష్ణుడు కర్ణుడిని ఎన్నిసార్లు ప్రశంసించాడో తెలుసుకోండి. మన చరిత్రపై నాకు ఎంతో గౌరవం ఉంది. నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు. ‘కల్కి పార్ట్ 2’ కోసం వేచి ఉండండి” అని సమాధానమిచ్చారు.
నాగ్ అశ్విన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా “వెయిట్ ఫర్ పార్ట్ 2” అన్న ఆయన వ్యాఖ్యతో సీక్వెల్‌పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ‘కల్కి 2898 AD’ తొలి భాగం విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు, ప్రభాస్ నటనతో భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ, కర్ణుడి పాత్ర చిత్రీకరణపై అప్పటి నుంచే కొంత చర్చ కొనసాగుతోంది. ఇప్పుడు దర్శకుడు స్వయంగా స్పందించడంతో రెండో భాగంలో కర్ణుడి పాత్రకు మరింత ప్రాధాన్యం ఉంటుందా? మహాభారతంలోని మరిన్ని అంశాలను ఎలా చూపించబోతున్నారు? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
