‘వారణాసి’లో అభయ్ రామ్ ఎంట్రీ?

‘వారణాసి’లో అభయ్ రామ్ ఎంట్రీ?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ సినిమా ‘వారణాసి’పై మరో ఆసక్తికర ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా టాక్ ప్రకారం, జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు అభయ్ రామ్ ఈ సినిమాలో మహేష్ బాబు చిన్ననాటి పాత్రలో కనిపించనున్నారనే వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. సినిమా కథలో చిన్న మహేష్ పాత్రకు కీలక ప్రాధాన్యం ఉండటంతో, ఆ పాత్రకు అభయ్ రామ్‌ను ఎంపిక చేయాలని రాజమౌళి భావించారనే ప్రచారం జరుగుతోంది. రాజమౌళి, ఎన్టీఆర్ మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఈ ప్రతిపాదనకు ఎన్టీఆర్ కూడా అంగీకరించారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఈ ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ చిన్ననాటి పాత్రలో అభయ్ రామ్ కనిపిస్తే అది సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అభిప్రాయపడుతున్నారు. గతంలో మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణ బాలనటుడిగా వెండితెరపై కనిపించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు అభయ్ రామ్ కూడా సినీ అరంగేట్రం చేస్తే అభిమానులకు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇవన్నీ ప్రస్తుతం ప్రచారం మాత్రమే కాగా, అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Related Articles