భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన మధుర గానంతో కోట్లాది మంది అభిమానుల మనసులు గెలుచుకున్న ప్రముఖ గాయని ఎస్. జానకి వ్యక్తిగత జీవితం మాత్రం ఎంతో సాదాసీదాగా సాగింది. ఆమెది ప్రేమ వివాహం కావడం విశేషం. తన సంగీత ప్రయాణంలో భర్త రాంప్రసాద్ అందించిన సహకారం గురించి జానకమ్మ పలు సందర్భాల్లో భావోద్వేగంగా మాట్లాడారు. కెరీర్ ప్రారంభ రోజుల్లో కుటుంబ స్నేహితుల ద్వారా డాక్టర్ చంద్రశేఖరం కుమారుడు రాంప్రసాద్‌తో జానకికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి, పెద్దల అంగీకారంతో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. తన ప్రేమకథను గుర్తు చేసుకుంటూ, మొదట అది ప్రేమ అని తెలియకపోయినా రాంప్రసాద్ ఫోటోను దాచుకుని ఉంచేదాన్నని, అదే విషయం ఇంట్లో తెలిసి చివరకు పెళ్లి జరిగిందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
తాను సాధించిన విజయాల వెనుక భర్త పాత్ర ఎంతో కీలకమని జానకి చెప్పేవారు. రికార్డింగ్‌లు, తేదీలు, పారితోషికం, ఒప్పందాలు వంటి అన్ని వ్యవహారాలను రాంప్రసాద్ చూసుకునేవారని, తాను ప్రశాంతంగా పాటలు పాడేలా ఆయన పూర్తి బాధ్యత తీసుకునేవారని తెలిపారు. ఒకే రోజు పలు స్టూడియోల్లో, వేర్వేరు భాషల్లో పాటలు పాడాల్సి వచ్చినా తనపై ఒత్తిడి పడకుండా భర్త అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు.
తమ ఇద్దరి మధ్య ఎంతో ఆప్యాయత ఉండేదని జానకమ్మ చెప్పారు. “ఆయనను ఒక్క నిమిషం కూడా వదిలి ఉండేదాన్ని కాదు. బయటకు వెళ్లినా వెంటనే తిరిగి వచ్చేవారు” అంటూ తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అలాగే అత్త శకుంతలాబాయి కూడా కుటుంబ బాధ్యతలు, కుమారుడి సంరక్షణలో ఎంతో సహాయం చేశారని తెలిపారు.
జానకి దంపతులకు మురళీకృష్ణ అనే కుమారుడు ఉన్నారు. కోడలు ఉమ ప్రముఖ కూచిపూడి, భరతనాట్యం నర్తకి కాగా, వారికి అమృతవర్షిణి, అప్సర అనే ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు.
తన జీవితంలో అత్యంత బాధాకరమైన సంఘటన భర్త మరణమని జానకి ఎన్నోసార్లు చెప్పారు. “నా భర్త చేతుల్లోనే ఈ లోకాన్ని విడిచిపెట్టాలని కోరుకునేదాన్ని. కానీ ఆయన నాకంటే ముందే వెళ్లిపోయారు” అంటూ భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం కుమారుడు మురళీకృష్ణను కూడా కోల్పోవడం ఆమెను మరింత కలిచివేసింది. వ్యక్తిగత జీవితంలో ఎన్నో విషాదాలను ఎదుర్కొన్నప్పటికీ, తన గానంతో ఎస్. జానకి శాశ్వతంగా సంగీతాభిమానుల హృదయాల్లో నిలిచిపోయారు.

