‘డోంట్ ట్రబుల్’ టీజర్‌లో హారర్ టచ్

‘డోంట్ ట్రబుల్’ టీజర్‌లో హారర్ టచ్

మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. దర్శకుడు శశాంక్ యేలేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాని శోభు యార్లగడ్డ, ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫహాద్ తొలిసారిగా పూర్తి స్థాయి తెలుగు పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. టీజర్‌లో ఫహాద్ ఫాజిల్ ఓ మెజీషియన్ పాత్రలో కనిపిస్తారు. ఓ చిన్నారికి మ్యాజిక్ ట్రిక్స్ చూపిస్తూ ఆమెను మాయంచేసే ప్రయత్నం చేస్తాడు. అయితే ఆ తర్వాత పరిస్థితులు అనూహ్యంగా మారిపోతాయి. సాధారణంగా కనిపించిన ఆ చిన్నారి విచిత్రంగా ప్రవర్తిస్తూ అతీత శక్తులను ప్రదర్శిస్తుంది. దీంతో భయపడిన మెజీషియన్ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ చిన్నారి అతడిని వెంటాడుతూ కనిపించడం టీజర్‌కు థ్రిల్లింగ్ టచ్‌ను తీసుకొచ్చింది.

హారర్, ఫాంటసీ, మిస్టరీ, థ్రిల్లర్ అంశాల మేళవింపుతో రూపొందిన టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా చివర్లో వచ్చే విజువల్స్, నేపథ్య సంగీతం సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి.

ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్‌తో పాటు సారా పాలేకర్, సౌరభ్ సచ్‌దేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విభిన్న కథాంశంతో రూపొందుతున్న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా సెప్టెంబర్ 11న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Related Articles