పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ సినిమా ‘స్పిరిట్’పై మరో ఆసక్తికరమైన అప్‌డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌లోనే హై- ఓల్టేజ్ క్లైమాక్స్ ఎపిసోడ్‌ను చిత్రీకరించాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది.
ఈ కీలక షెడ్యూల్‌లో ప్రభాస్‌తో పాటు ప్రధాన తారాగణం మొత్తం పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ కనిపించనున్న ఈ సినిమాలో ఆయన సరసన త్రుప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రభాస్‌ను ఇప్పటివరకు చూడని మాస్, వైల్డ్ లుక్‌లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చూపించనున్నట్లు టాక్.
ఇప్పటికే సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్‌తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తయ్యాయి. టి- సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

