సీనియర్ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్ మరోసారి తన సరదా వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తాజాగా ‘వదల’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు అనిల్ రావిపూడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “అనిల్ రావిపూడి ఇప్పుడు చాలా పెద్ద దర్శకుడు అయిపోయాడు. ఈ కార్యక్రమానికి వస్తాడో లేదో అనుకున్నాను. ‘గురువుగారు… మీరు ఫోన్ చేయండి’ అన్నాడు. నేను కాల్ చేస్తే ఫోన్ ఎత్తలేదు. తర్వాత ఆయనే తిరిగి ఫోన్ చేసి మాట్లాడి, ఈవెంట్కు తప్పకుండా వస్తానని చెప్పాడు. మాట కూడా నిలబెట్టుకున్నాడు” అని తమ్మారెడ్డి తెలిపారు.
అనంతరం తనపైనా సరదాగా స్పందిస్తూ, “మేమూ ఒకప్పుడు దర్శకులుగా బిజీగా ఉన్నప్పుడు చాలామందిని వెయిట్ చేయించేవాళ్లం. ఫోన్లు వెంటనే ఎత్తేవాళ్లం కాదు. కాబట్టి అనిల్ అలా చేయడంలో తప్పేమీ లేదు” అని నవ్వుతూ అన్నారు. దీంతో సభలో నవ్వులు పూశాయి. తమ్మారెడ్డి వ్యాఖ్యలకు అనిల్ రావిపూడి కూడా చిరునవ్వుతో స్పందించగా, అక్కడున్న సినీ ప్రముఖులు చప్పట్లతో అభినందించారు.
ఇదిలా ఉండగా, ‘వదల’ సినిమాలో జగపతిబాబు, లయ చాలా కాలం తర్వాత మరోసారి జంటగా నటిస్తున్నారు. రొమాంటిక్ మిస్టరీ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమా జులై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

