‘వదలా’ను ఆదరించండి: జగపతిబాబు

‘వదలా’ను ఆదరించండి: జగపతిబాబు

సీనియర్ నటుడు జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన ‘వదలా’ సినిమా జులై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆకెళ్ల వి. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లయ, హృతిక శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించారు. కిశోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. విడుదలకు ముందు హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ- రిలీజ్ వేడుకకు దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ, ‘వదలా’ ఓ కుటుంబ భావోద్వేగాలతో కూడిన థ్రిల్లర్ అని తెలిపారు. కథపై పూర్తి నమ్మకంతోనే ఈ సినిమా చేశానని, ప్రతి సన్నివేశాన్ని ఎంతో శ్రద్ధగా తెరకెక్కించామని చెప్పారు. ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తే హీరోగా మరిన్ని వైవిధ్యమైన పాత్రలు చేయడానికి మరింత ఉత్సాహం వస్తుందని అన్నారు. సినిమా విడుదలకు ముందు వ్యాపారం పూర్తికాకపోయినా, ప్రేక్షకులపై ఉన్న నమ్మకంతో నిర్మాతలు ధైర్యంగా విడుదల చేస్తున్నారని పేర్కొన్నారు.

నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, సినీ పరిశ్రమలో తన ప్రయాణానికి 50 ఏళ్లు పూర్తయ్యాయని చెప్పారు. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ నిర్మాణంలోకి రావడానికి కిశోర్ నాయుడు ప్రోత్సహించారని వెల్లడించారు. తన నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన ‘అంతఃపురం’ తర్వాత ఇదే అత్యుత్తమ చిత్రమని పేర్కొంటూ, ప్రేక్షకులు ‘వదలా’ను థియేటర్లలో తప్పకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు, సాంకేతిక నిపుణులు పాల్గొని సినిమా విజయంపై ఆశాభావం వ్యక్తం చేశారు.

Related Articles