విజయ రహస్యం చెప్పిన ప్రియాంక

విజయ రహస్యం చెప్పిన ప్రియాంక

బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా జీవితంలో విమర్శలను ఎలా స్వీకరించాలి, ఇతరుల అభిప్రాయాల వల్ల ప్రభావితమవకుండా ఎలా ముందుకు సాగాలనే అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరినీ సంతృప్తిపరచడం అసాధ్యమని, అందుకే తమపై తాము నమ్మకం కోల్పోవద్దని ఆమె సూచించారు. ‘‘ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారనే దానికంటే, మనం మనకు ఎంత నిజాయతీగా ఉంటామనేదే ముఖ్యమైంది. ఎవరైనా మిమ్మల్ని పనికిరానివారని చెప్పారని అంటే అది ఏమాత్రం నిజమైపోదు. కాబట్టి విమర్శలను మనసుకు దగ్గరగా తీసుకోకుండా, మనపై మనం నమ్మకంతో ముందుకు సాగాలి’’ అని ప్రియాంక అన్నారు. అలాగే కుటుంబ సభ్యులు, అభిమానులు, మనల్ని ప్రేమించే వారి పట్ల నిజాయతీగా ఉండాలని, ప్రతి పనిని తన శక్తిమేరకు ఉత్తమంగా చేయడానికి ప్రయత్నిస్తే చాలని ఆమె పేర్కొన్నారు. ‘‘అందరినీ మెప్పించాలనే ఒత్తిడిని వదిలేస్తే జీవితం మరింత ప్రశాంతంగా ఉంటుంది’’ అని చెప్పారు.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం ప్రియాంక చోప్రా ‘వారణాసి’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం గత 14 నెలలుగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో కొన్ని క్లిష్టమైన స్లో- మోషన్ యాక్షన్ సన్నివేశాల్లో నటించానని, అయితే సినిమా గురించి ఇప్పుడే మరిన్ని వివరాలు చెప్పలేనని ఆమె తెలిపారు. ప్రియాంక చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles