బన్నీ సినిమాపై బసిల్ హింట్

బన్నీ సినిమాపై బసిల్ హింట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో మలయాళ దర్శకుడు బసిల్ జోసెఫ్ సినిమా చేయబోతున్నారనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన లేకపోయినా, తాజాగా బసిల్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. బసిల్ జోసెఫ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ‘Icon’ అని రాసి ఉన్న క్యాప్ ఫొటోను షేర్ చేశారు. అల్లు అర్జున్‌ను అభిమానులు ‘ఐకాన్ స్టార్’గా పిలవడం తెలిసిందే. దీంతో ఈ పోస్ట్ బన్నీతో చేయబోయే సినిమాకు పరోక్ష సంకేతమని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ఇటీవల అల్లు శిరీష్ వివాహ వేడుకలో బసిల్ జోసెఫ్ పాల్గొనడం కూడా ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. ఇద్దరి మధ్య ఇప్పటికే కథా చర్చలు జరిగాయని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ప్రాజెక్టుపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

‘మిన్నల్ మురళి’తో ప్రశంసలు అందుకున్న బసిల్ జోసెఫ్, అల్లు అర్జున్‌తో ‘శక్తిమాన్’ కథ తెరకెక్కించనున్నారనే ప్రచారం గతంలో జరిగింది. అయితే ఆ వార్తలను దర్శకుడు ఖండిస్తూ, బన్నీతో చేయబోయేది పూర్తిగా కొత్త కథేనని స్పష్టం చేశారు. కథకు సంబంధించిన వివరాలను మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు.

ఈ సినిమాని గీతా ఆర్ట్స్ నిర్మించే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ‘రాకా’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అనంతరం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో భారీ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఈ రెండు సినిమాల తర్వాతే బసిల్ జోసెఫ్ దర్శకత్వంలోని సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని టాలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles