ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి సినిమాలపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి. గత కొంతకాలంగా మలయాళ దర్శకుడు బసిల్ జోసెఫ్‌తో బన్నీ ఓ సినిమా చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్టుపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాకపోవడంతో ఆ వార్తలు కేవలం ప్రచారానికే పరిమితమయ్యాయి. ఇటీవల దర్శకుడు బసిల్ జోసెఫ్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ మరోసారి ఈ ప్రాజెక్టును వార్తల్లోకి తెచ్చింది. ‘ఐకాన్’ అని రాసి ఉన్న టోపీతో పాటు అల్లు అర్జున్ నటించిన ‘ఆర్య-2’ సినిమాలోని ‘రింగా రింగా’ పాటను ఆయన షేర్ చేయడం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించింది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు, సినీ వర్గాలు బన్నీ- బసిల్ కాంబినేషన్ దాదాపు ఖరారైందని, త్వరలో అధికారిక ప్రకటన రావచ్చని అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ దర్శకుడు అట్లీతో భారీ బడ్జెట్ సినిమా ‘రాకా’లో నటించడానికి సిద్ధమవుతున్నారు. అలాగే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోనూ మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బసిల్ జోసెఫ్ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.
దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ మంచి గుర్తింపు పొందిన బసిల్ జోసెఫ్, ‘మిన్నల్ మురళి’ వంటి విజయవంతమైన సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. దీంతో అల్లు అర్జున్– బసిల్ జోసెఫ్ కాంబినేషన్ నిజమైతే అది ప్రేక్షకులకు మరో క్రేజీ ప్రాజెక్ట్ కానుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ వార్తలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

