మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచే రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ అన్ని ప్రాంతాల్లో హౌస్ఫుల్ ప్రదర్శనలతో విజయవంతంగా కొనసాగుతోంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ‘బాక్సాఫీస్ ఛాంపియన్’ సక్సెస్ మీట్లో నిర్మాత వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తొలి రోజే రూ.135 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వస్తున్న స్పందన అద్భుతమని చెప్పారు.
రామ్ చరణ్ కెరీర్లో ఇదే బెస్ట్ ఓపెనింగ్ అని, రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టికెట్ రేట్ల విషయంలో సహకరించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు, మీడియాకు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. మైత్రి మూవీ మేకర్స్, చిత్ర బృందం కూడా ఈ విజయాన్ని ప్రేక్షకులకే అంకితం చేసింది.

