దివంగత నటుడు కొచ్చిన్ హనీఫా కలగన్న సొంతింటి నిర్మాణం ఆయన మరణించిన 16 ఏళ్ల తర్వాత పూర్తయింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 300కు పైగా సినిమాల్లో నటించిన హనీఫా, తన జీవితకాలంలో సొంతిల్లు నిర్మించుకోవాలని ఎంతో ఆశపడ్డారు. అయితే 2010లో ఆయన ఆకస్మిక మరణంతో ఆ కల మధ్యలోనే ఆగిపోయింది. హనీఫా మరణానంతరం ఆస్తులకు సంబంధించిన న్యాయపరమైన సమస్యలు తలెత్తడంతో ఇంటి నిర్మాణం చాలాకాలం వాయిదా పడింది. ఈ సమయంలో ఆయన భార్య ఫసీలా, కవల కుమార్తెలు సఫా, మార్వా అద్దె ఇంట్లోనే నివసించారు. చివరకు అన్ని అడ్డంకులను అధిగమించి కొచ్చిలోని వెన్నెల ప్రాంతంలో మూడు అంతస్తుల ఇంటిని నిర్మించి గృహప్రవేశం చేశారు.
ఈ ఇంటికి ‘కొచ్చిన్ హనీఫాస్ ఏబీ మంజిల్’ అనే పేరు పెట్టారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన సఫా, మార్వా కొత్త ఇంటి ఇంటీరియర్ డిజైన్‌ను స్వయంగా రూపొందించడం విశేషం. ఇంటి అంతటా హనీఫా జ్ఞాపకాలను ప్రతిబింబించే ఫొటోలు, స్మారక వస్తువులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫసీలా మాట్లాడుతూ, కుటుంబం ఎవరి వద్దా ఆర్థిక సహాయం కోరలేదని, హనీఫా దాచిన సొమ్ముతోనే ఈ ఇంటిని నిర్మించామని చెప్పారు. అలాగే నటుడు దిలీప్ హనీఫా ఉపయోగించిన కారును సినిమా షూటింగ్‌ల కోసం వినియోగించేలా ఏర్పాటు చేసి, కుటుంబానికి ఎన్నో ఏళ్ల పాటు ఆదాయం వచ్చేలా సహకరించారని ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

