టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘సూపర్ సుబ్బు’ ట్రైలర్‌ను నెట్‌ఫ్లిక్స్ ఇండియా విడుదల చేసింది. నెట్‌ఫ్లిక్స్ తొలి ఒరిజినల్ తెలుగు సిరీస్‌గా రూపొందిన ఈ కామెడీ డ్రామాకు ‘డీజే టిల్లు’ ఫేమ్ మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నటి మిథిలా పాల్కర్ కథానాయికగా నటిస్తోంది.
సుబ్రమణ్యం చిలుకూరి రావు అలియాస్ సుబ్బు అనే అమాయక యువకుడికి ఎవరూ వెళ్లాలనుకోని ‘మాకీపూర్’ గ్రామానికి పోస్టింగ్ వస్తుంది. అక్కడ అతను సెక్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా పనిచేయాల్సి రావడంతో ఎదురయ్యే సవాళ్లు, అపార్థాలు, హాస్యభరిత సంఘటనలతో కథ సాగుతుంది. ఉద్యోగ ఒత్తిళ్లు, ప్రేమ సమస్యలు, గ్రామస్తుల విచిత్ర ప్రవర్తన మధ్య సుబ్బు పడే ఇబ్బందులు ట్రైలర్‌లో వినోదాన్ని పంచాయి.
ఈ సిరీస్‌లో మిథిలా పాల్కర్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాత్రలో కనిపించనుంది. అలాగే బ్రహ్మానందం, మురళీ శర్మ, గెటప్ శ్రీను, జీవన్, మానస చౌదరి కీలక పాత్రలు పోషించారు. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, భరత్ లక్ష్మీపతి నిర్మించిన ఈ సిరీస్‌కు మల్లిక్ రామ్, రమేష్ ఎలిగేటి, శివాని ధోబాల్ కథ అందించారు. ‘సూపర్ సుబ్బు’ జులై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

