హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ (అవతార్ 3) ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన ఈ చిత్రం బుధవారం నుంచి జియోహాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
ప్రేక్షకులు ఈ సినిమాను ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వీక్షించవచ్చు. ‘అవతార్’ ఫ్రాంచైజీలో మూడో భాగంగా వచ్చిన ఈ చిత్రంలో జేమ్స్ కామెరాన్ మరోసారి పండోరా ప్రపంచాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు.
మొదటి భాగంలో అడవుల ప్రపంచాన్ని, రెండో భాగంలో సముద్ర గర్భంలోని జీవన విధానాన్ని చూపించిన దర్శకుడు, ఈసారి ‘ఫైర్ అండ్ యాష్’లో ‘యాష్ పీపుల్’ అనే కొత్త నావి తెగను పరిచయం చేశారు. క్రూర స్వభావం కలిగిన ఈ తెగ కథలో కీలక పాత్ర పోషిస్తుంది.
అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, అద్భుతమైన ప్రపంచ నిర్మాణం, భావోద్వేగాలతో కూడిన కథనంతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. థియేటర్లలో మిస్ అయిన సినీ అభిమానులు ఇప్పుడు ఇంటి వద్దే ఓటీటీలో ఈ విజువల్ స్పెక్టకిల్‌ను ఆస్వాదించవచ్చు.

