క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18 సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఈ నెల 22న మెగా టోర్నీ షురూ కానున్నది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఇక ఈ ఈవెంట్‌లో పలువురు స్టార్ సెలబ్రిటీలు సందడి చేయనున్నట్లు తెలిసింది. ఆరంభ వేడుకల్లో అరిజిత్ సింగ్, శ్రేయా ఘోషల్ సంగీత ప్రదర్శనలు ఇవ్వనున్నారు. పంజాబ్ స్టార్ ర్యాపర్ కరన్ ఔజ్లా ప్రత్యేక షో చేయనున్నట్లు తెలిసింది. అంతేకాదు, బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు సల్మాన్ ఖాన్, వరుణ్ ధావన్, కత్రినా కైఫ్, విక్కీ కౌషల్, త్రిప్తి దిమ్రి, మాధురీ దీక్షిత్, జాన్వీ కపూర్, శ్రద్ధా కపూర్, దిశా పటాని తదితర స్టార్స్ పాల్గొననున్నారు. ఆరంభ వేడుకల్లో వీరు ప్రత్యేక ప్రదర్శనతో అభిమానులను ఉర్రూతలూగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. స్టార్ ప్రదర్శనలతో పాటు, అనేక ఇతర కార్యక్రమాలు కూడా అట్టహాసంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. మార్చి 22న ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కానుంది. మే 25న ఫైనల్ మ్యాచ్ వరకు ఈ సీజన్ అలరించనుంది. మొత్తం 74 మ్యాచులు 65 రోజుల పాటు జరుగుతాయి. తొలి మ్యాచ్ మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభం కానుంది. ఇప్పటివరకు ముంబై, చెన్నై జట్లు అత్యధికంగా చెరో ఐదు సార్లు విజేతలుగా నిలవగా, వాటి తరువాత మూడుసార్లు కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది. ఇక పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ వంటి జట్లుకు ఐపీఎల్ ట్రోఫీ చేతికొచ్చినట్టే వచ్చి చేజారిపోతోంది. ఈ సారైన వారు ట్రోఫీని అందుకుంటారో లేదో వేచి చూడాలి.

- March 19, 2025
0
15
Less than a minute
Tags:
You can share this post!
editor