రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా నటించిన ‘రాజా ది రాజా’ సినిమా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ బోయిడపు దర్శకత్వంలో కె. నిహారిక దాసరి నిర్మించిన ఈ సినిమాలో సాయికుమార్, నరేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాత నిహారిక మాట్లాడుతూ, ‘‘ప్రేమ, వినోదం, భావోద్వేగాలతో కూడిన పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. యువతతో పాటు అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని తెలిపారు.
ఈ సినిమాలో హీరో రుత్విక్ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారని చెప్పారు. ట్రైలర్ చూసిన కొందరు ఈ సినిమాని ‘మగధీర’తో పోలుస్తున్నారని, అయితే రెండు సినిమాల కథలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ‘‘సినిమా చూసిన తర్వాత ఇందులోని అసలు ట్విస్ట్ ప్రేక్షకులకు అర్థం అవుతుందని అన్నారు. ఇది మంచి ఫీల్‌గుడ్ మూవీ. ప్రతి ఒక్కరికీ కొత్త అనుభూతిని అందిస్తుంది’’ అని నిహారిక పేర్కొన్నారు.

