ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్- వరల్డ్ సినిమా ‘రాకా’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించగా, ఇప్పుడు పంజాబీ నటి నైలా గ్రేవల్ కూడా ఈ సినిమాలో భాగమైనట్లు వెల్లడించింది. తాజా ఇంటర్వ్యూలో నైలా మాట్లాడుతూ, ‘‘దర్శకుడు అట్లీతో పనిచేయాలని చాలాకాలంగా కోరుకున్నాను. ఇప్పుడు ఆ అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి భారీ పాన్- ఇండియా ప్రాజెక్ట్‌లో భాగం కావడం నా కెరీర్‌లో ప్రత్యేకమైన మైలురాయి’’ అని చెప్పింది.
నైలా గ్రేవల్ ఇప్పటికే ‘తమాషా’, ‘బరేలీ కి బర్ఫీ’, ‘తప్పడ్’, ‘ఇష్క్ విశ్క్ రీబౌండ్’ వంటి హిందీ సినిమాలతో గుర్తింపు పొందింది. ఇటీవల మలయాళ నటి ఫెమినా జార్జ్ కూడా ‘రాకా’లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్, యాక్షన్ నేపథ్యంలో అట్లీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, మిగిలిన నటీనటులు, కథకు సంబంధించిన వివరాలను త్వరలోనే మేకర్స్ అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

