తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరోసారి తన సాదాసీదా స్వభావంతో అందరి ప్రశంసలు అందుకున్నారు. చెన్నైలో నిర్వహించిన ఆరోగ్య శాఖ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఓ జూనియర్ డాక్టర్ అడిగిన కోరికను వెంటనే నెరవేర్చారు.
నియామక ఉత్తర్వు అందుకోవడానికి వేదికపైకి వచ్చిన డాక్టర్, “సార్.. మిమ్మల్ని ఒకసారి హగ్ చేసుకోవచ్చా?” అని అడగగా, సీఎం విజయ్ చిరునవ్వుతో అంగీకరించారు. అనంతరం ఆ డాక్టర్ ఆయనను కౌగిలించుకుని అపాయింట్‌మెంట్ ఆర్డర్ అందుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో తమిళనాడు వైద్యారోగ్య శాఖకు ఎంపికైన 2,144 మంది అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందజేశారు. ఇందులో 751 మంది అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లు, 1,393 మంది హెల్త్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు.
ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా విజయ్ ప్రజలతో ఎంతో ఆప్యాయంగా మెలుగుతున్నారు. గతంలో ఓ గర్భిణీ అభ్యర్థి కోసం వేదిక దిగివచ్చి నియామక పత్రం అందించిన ఘటన కూడా చర్చనీయాంశమైంది. ఇప్పుడు డాక్టర్ కోరికను మన్నించి హగ్ ఇవ్వడంతో ఆయనపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

