మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ థియేటర్లలో ఘన విజయం సాధించిన తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. జులై 9 నుంచి ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి రానుంది.
తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. దీంతో థియేటర్లలో ఈ సినిమాను చూడలేకపోయిన ప్రేక్షకులు ఇంటి నుంచే వీక్షించే అవకాశం పొందనున్నారు.
గ్రామీణ క్రీడల నేపథ్యంలో రూపొందిన ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా విడుదలైన తొలి రోజు నుంచే మంచి స్పందన అందుకుంది. స్పోర్ట్స్, కుటుంబ భావోద్వేగాలు, గ్రామీణ నేపథ్యాన్ని దర్శకుడు బుచ్చిబాబు సమతుల్యంగా మేళవించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా రామ్ చరణ్ నటనకు ప్రశంసలు దక్కాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ఆయన కెరీర్లో మరో విజయవంతమైన చిత్రంగా నిలిచింది.
ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా, దివ్యేందు, బొమన్ ఇరానీ, జగపతిబాబు, రవికిషన్ కీలక పాత్రలు పోషించారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ నిర్మించిన ఈ చిత్రం, థియేటర్ల తర్వాత ఓటీటీలోనూ మంచి ఆదరణ పొందుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

