పొలిటికల్ ఎంట్రీపై విశాల్ హింట్

పొలిటికల్ ఎంట్రీపై విశాల్ హింట్

తమిళ హీరో విశాల్ చేసిన తాజా వ్యాఖ్యలు ఆయన రాజకీయ ప్రవేశంపై మరోసారి చర్చకు దారితీశాయి. ఓ బహిరంగ సభలో మాట్లాడిన విశాల్.. ఇప్పటివరకు నటుడిగా సంపాదించిన మంచి పేరును ప్రజాసేవ కోసం ఉపయోగించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. “ఇన్నేళ్లుగా ప్రేక్షకులు చూపిన ప్రేమకు ప్రతిఫలంగా సమాజానికి ఏదైనా చేయాలనుకుంటున్నాను. ఇకపై నా ప్రయాణం సాధారణంగా ఉండదు. నిజాయతీతో, ఎలాంటి అడ్డదారులు లేకుండా ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం. అన్ని రంగాల్లో ప్రజలకు అండగా నిలుస్తాను” అని విశాల్ అన్నారు. ఆయన వ్యాఖ్యలతో భవిష్యత్తులో రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశాలపై ఊహాగానాలు మరింత పెరిగాయి.

అయితే, రాజకీయాలపై విశాల్ స్పందించడం ఇదే తొలిసారి కాదు. 2024లో కూడా ఈ అంశంపై స్పందిస్తూ, తన అభిమాన సంఘాన్ని కేవలం అభిమాన కార్యక్రమాలకే కాకుండా ప్రజాసేవకు వినియోగిస్తున్నానని చెప్పారు. దీనికి రాజకీయ ఉద్దేశం లేదని స్పష్టం చేసిన ఆయన, పరిస్థితులు అనుకూలిస్తే ప్రజల తరఫున పనిచేయడానికి మాత్రం వెనుకాడనని తెలిపారు. విశాల్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన రాజకీయ అరంగేట్రంపై తమిళనాడులో మరోసారి చర్చ ప్రారంభమైంది.

Related Articles