మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌కు ఇటీవల జరిగిన మణికట్టు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైంది. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా ‘పెద్ది’ చిత్ర నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్టు చేస్తూ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. “రామ్‌చరణ్ మణికట్టు గాయంతో బాధపడుతున్నప్పటికీ ‘పెద్ది’ సినిమాలోని కీలక సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేశారు. సినిమా పట్ల ఆయన చూపిన అంకితభావం, పట్టుదల మా టీమ్‌కు స్ఫూర్తిగా నిలిచాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. పూర్తి ఆరోగ్యంతో త్వరలోనే తిరిగి రావాలని కోరుకుంటున్నాం” అని వృద్ధి సినిమాస్ పేర్కొంది.
కోయంబత్తూరులోని గంగా ఆస్పత్రిలో డా. ఎస్. రాజశేఖరన్ ఆధ్వర్యంలో రామ్‌చరణ్‌కు ఈ శస్త్రచికిత్స జరిగింది. అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యుడు డా. అలెజాండ్రో బాడియా బృందంతో కలిసి డా. ప్రవీణ్ భరద్వాజ్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.
శస్త్రచికిత్స సందర్భంగా రామ్‌చరణ్‌తో పాటు భార్య ఉపాసన, తల్లిదండ్రులు చిరంజీవి, సురేఖ కోయంబత్తూరుకు వెళ్లారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న చరణ్, కోలుకున్న అనంతరం దర్శకుడు సుకుమార్‌తో తన తదుపరి సినిమాని ప్రారంభించనున్నారు. ఈ సినిమా ప్రీ- ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతుండగా, అక్టోబర్ లేదా నవంబర్‌లో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

