కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన చిన్ననాటి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. చెన్నైలో అభిమానులు నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఆయన, చిన్నప్పుడు తన పుట్టినరోజు గురించి కూడా తెలియదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “జులై 28 నాకు ఒక సాధారణ తేదీ మాత్రమే. నాలుగో తరగతి వరకు నా పుట్టినరోజు ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. స్కూల్లో స్నేహితులు కొత్త బట్టలు వేసుకుని చాక్లెట్లు పంచుతుంటే, నేనూ అలానే జరుపుకోవాలని అనిపించేది. ఆ విషయాన్ని మా అక్కకు చెప్పగా, జులై 28నే నా పుట్టినరోజు అని చెప్పింది. అప్పటి నుంచి బర్త్‌డేకు కొత్త బట్టలు కొనిపించుకుని, నా దగ్గరున్న డబ్బులతో చాక్లెట్లు కొనుగోలు చేసి స్నేహితులకు పంచేవాడిని” అని ధనుష్ తెలిపారు.
కాలక్రమేణా పుట్టినరోజుపై ఆసక్తి తగ్గిందని, కానీ ఇప్పుడు అభిమానులు తన పుట్టినరోజును ఘనంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అలాగే అభిమానులు కేవలం సినిమా వేడుకలకే పరిమితం కాకుండా, స్థానికంగా రక్తదాన శిబిరాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

