తమిళనాడు ముఖ్యమంత్రి, హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదలకు ముందే ఆన్లైన్లో లీక్ కావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఎన్నికల సమయంలో రాజకీయ లబ్ధి కోసమే చిత్రబృందం ఉద్దేశపూర్వకంగా సినిమాను లీక్ చేసిందన్న ప్రచారంపై దర్శకుడు హెచ్. వినోద్ తాజాగా స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన, ఆ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. “రూ.400 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన సినిమాను ఎవరైనా కావాలని లీక్ చేస్తారా?” అంటూ ప్రశ్నించారు. లీక్ జరిగిన సమయంలో విజయ్ అధికారంలో లేరని, రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు తప్పుడు ప్రచారం చేశారని స్పష్టం చేశారు.
ఈ వివాదంపై విజయ్ స్పందించకపోవడానికి కూడా కారణం ఉందని వినోద్ తెలిపారు. ఆయన ముందే స్పందించి ఉంటే, దానికీ రాజకీయ రంగు పులిమేవారని అన్నారు. లీక్ వ్యవహారంపై నిర్మాతలు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారని, అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
అనేక అడ్డంకుల తర్వాత ‘జన నాయగన్’ జులై 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందనే నమ్మకాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు.

