మందుకు బానిసై దేవదాస్‌లా మారా: అమిర్‌ఖాన్‌

మందుకు బానిసై దేవదాస్‌లా మారా: అమిర్‌ఖాన్‌

బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ ఇటీవల వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన వ్యక్తిగత జీవితంలోని కొన్ని బాధాకరమైన అనుభవాలను పంచుకున్నారు. చాలా రోజుల త‌ర్వాత ఆయ‌న సితారే జమీన్ పర్ అనే సినిమాలో న‌టిస్తున్నాడు. అయితే రీసెంట్‌గా త‌న 60వ పుట్టిన‌రోజును జ‌రుపుకున్న ఈ హీరో మొదటి భార్య‌ రీనా దత్తాతో విడాకులు గురించి స్పందించాడు. రీనాను తాను ఎంతగానో ప్రేమించానని.. కానీ అనుకోకుండా మేమిద్ద‌రం విడిపోయామ‌ని ఈ విడాకులు త‌న‌ను తీవ్రంగా కుంగదీసినట్లు, దాని కారణంగా మద్యానికి బానిస అయినట్లు అమీర్ తెలిపారు. రీనాతో విడిపోయిన సమయంలో నేను చాలా బాధపడ్డాను. సుమారు మూడేళ్లపాటు ఒక్క‌డినే ఒంట‌రిగా గడిపాను. షూటింగ్‌లకు దూరంగా పనిపై దృష్టి పెట్టలేకపోయాను. స్క్రిప్ట్‌లు కూడా చదవలేదు, వినలేదు. ఇంట్లో ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉండేవాడిని. నిద్ర కూడా పట్టేది కాదు. ఏం చేయాలో అర్థం కాక, ప్రశాంతంగా నిద్రపోవడం కోసం మద్యం తాగడం మొదలుపెట్టాను. ఆల్కహాల్ గురించి ఏమీ తెలియని నేను ఒక్కసారిగా రోజుకో బాటిల్ తాగే స్థాయికి చేరాను. ఏడాదిన్నర పాటు మద్యానికి బానిస అయ్యాను. ఒక విధంగా చెప్పాలంటే దేవదాస్‌లా మారిపోయాను. తీవ్రమైన మానసిక కుంగుబాటులోకి వెళ్లాను. ఆ పరిస్థితి నుండి బయటపడటానికి సినిమాను ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టాను. అదే నా జీవితాన్ని మార్చింది. సినిమా పట్ల నాకున్న ప్రేమ నా వ్యసనాలకు చెక్ పెట్టేలా చేసింది. అయితే ఇష్టపడిన వారు పక్కన లేకుండానే జీవితాన్ని కొనసాగించాలని తెలుసుకున్నానంటూ అమిర్ చెప్పుకొచ్చాడు. 1986లో అమిర్ ఖాన్, రీనా దత్తా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఐరా ఖాన్, జునైద్ ఖాన్ అనే ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. 16 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత, 2002లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అనంతరం అమిర్ 2005లో కిరణ్ రావును వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఆజాద్ రావు ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. కానీ, 2021లో అమిర్ కిరణ్ కూడా విడిపోయారు. ప్రస్తుతం అమిర్ ఖాన్ గౌరీ అనే స్నేహితురాలితో రిలేష‌న్‌లో ఉన్నాడు.

editor

Related Articles