బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా థడానీ ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం కానున్నారు. జయకృష్ణ ఘట్టమనేని హీరోగా నటించిన ఈ సినిమాకి అజయ్ భూపతి దర్శకత్వం వహించగా, జులై 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రషా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తెలుగు భాష తెలియకపోవడంతో ప్రారంభంలో డైలాగులు చెప్పడం కష్టంగా అనిపించిందని రషా తెలిపారు. దర్శకుడు అజయ్ భూపతి తనకు హిందీలో సన్నివేశాలను వివరించి, భావోద్వేగాలను సహజంగా పలికించేందుకు సమయం ఇచ్చారని చెప్పారు.
హీరో జయకృష్ణ చాలా సైలెంట్‌గా కనిపించినా, సెట్స్‌లో మాత్రం సరదాగా ఉండేవారని అన్నారు. షూటింగ్ విరామంలో ఇద్దరూ బోర్డ్ గేమ్స్ ఆడేవాళ్లమని, అయితే జయకృష్ణ ఎప్పుడూ చీటింగ్ చేసేవాడంటూ నవ్వుతూ చెప్పారు. మోహన్ బాబుతో కలిసి పనిచేయడం మంచి అనుభవమని, తన తల్లి రవీనా టాండన్‌తో నటించిన రోజుల జ్ఞాపకాలను ఆయన తనతో పంచుకున్నారని తెలిపారు.
నటన విషయంలో అమ్మ ప్రత్యేక సూచనలు ఇవ్వలేదని, కానీ తెలుగు సినీ పరిశ్రమలో షూటింగ్ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని, తెలుగు నేర్చుకోవాలని సలహా ఇచ్చిందన్నారు. ఈ సినిమాలో తన పాత్ర పేరు ‘మంగ’ అని, నిజ జీవితంలో తన స్వభావానికి ఆ పాత్ర చాలా దగ్గరగా ఉంటుందని చెప్పారు. అలాగే జీవీ ప్రకాశ్ సంగీతం అద్భుతంగా ఉందని, అందులో ‘మంగ మంగ’ పాట తనకు ఎంతో ఇష్టమని వెల్లడించారు.

