నేరుగా ఓటీటీలోకి మృణాల్ సినిమా

నేరుగా ఓటీటీలోకి మృణాల్ సినిమా

సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ థ్రిల్లర్ ‘పూజా మేరీ జాన్’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. 2022లోనే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా వివిధ కారణాలతో థియేటర్లలో విడుదల కాలేకపోయింది. దీంతో సినిమా విడుదలపై చాలా కాలంగా అనిశ్చితి నెలకొంది. మొదట ఈ సినిమా డిజిటల్ హక్కులను డిస్నీ+ హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. అయితే జియో- డిస్నీ విలీన పరిణామాల నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ విడుదల ఆలస్యమైంది. తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కులను జీ5 (ZEE5) దక్కించుకుంది. దీనికి సంబంధించిన అధికారిక వీడియోను విడుదల చేసిన సంస్థ, త్వరలోనే సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. అయితే స్ట్రీమింగ్ తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు.

నవజ్యోత్ గులాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హ్యుమా ఖురేషీ కీలక పాత్ర పోషించారు. కథ విషయానికి వస్తే.. పూజ అనే యువతి జీవితంలోకి ఓ అపరిచిత వ్యక్తి ప్రవేశిస్తాడు. అతడు ఆమెపై మోజు పెంచుకుని, ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, సోషల్ మీడియా ద్వారా నిరంతరం వేధిస్తూ ఆమె జీవితాన్ని భయాందోళనలకు గురిచేస్తాడు. ఈ డిజిటల్ స్టాకింగ్ నుంచి పూజ ఎలా బయటపడింది? ఆ అజ్ఞాత వ్యక్తిని ఎలా ఎదుర్కొంది? అన్న అంశాల చుట్టూ ఈ థ్రిల్లర్ కథ సాగుతుంది. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకుల్లో ఈ మూవీపై ఆసక్తి నెలకొంది.

Related Articles