ప్రఖ్యాత నటీమణి, నిర్మాత, స్టూడియో అధినేత కృష్ణవేణి (102) ఆదివారం ఉదయం హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1924 డిసెంబర్ 24న ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ కుగ్రామంలో కృష్ణవేణి జన్మించారు. ఆమె తండ్రి వృత్తి రీత్యా డాక్టర్. చిన్నతనం నుండి కృష్ణవేణికి కళలంటే ఆసక్తి. అందుకే రంగస్థల నటిగా కెరీర్ ప్రారంభించారు. స్వాతంత్య్రానికి పూర్వం ఓ స్త్రీ రంగస్థల నటిగా రాణించడం అంటే పెద్ద సాహసం. చిన్నతనం నుండి కృష్ణవేణిలో తెగువ, పట్టుదల, ఆత్మవిశ్వాసం మెండు. అందుకే అవేమీ పట్టించుకోలేదామె. తన దారిలో తాను నడిచారు. 1936లో వచ్చిన ‘సతీ అనసూయ’తో బాలనటిగా సినీ రంగంలోకి ప్రవేశింశారు. మోహినీ రుక్మాంగద, కచదేవయాని, మళ్లీ పెళ్లి చిత్రాలు కృష్ణవేణికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆమె మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు ఆమె చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. వారిలో ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కూడా ఉన్నారు. నాన్నగారి నట జీవితానికి తొలి అవకాశమిచ్చిన కృష్ణవేణిగారి మృతి బాధాకరం. తెలుగు సినీ చరిత్రలో కృష్ణవేణిది ప్రత్యేక అధ్యాయం. ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎన్నో గొప్ప చిత్రాలను నిర్మించారు.. నటించారు. ఆమె మృతి వ్యక్తిగతంగా మాకు తీరని లోటు. కృష్ణవేణమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా అని హీరో బాలకృష్ణ తెలిపారు.

- February 17, 2025
0
21
Less than a minute
Tags:
You can share this post!
editor