రాజశ్రీ వివాదం.. సల్మాన్‌కు అనుకూల తీర్పు

రాజశ్రీ వివాదం.. సల్మాన్‌కు అనుకూల తీర్పు

రాజశ్రీ పాన్ మసాలా ప్రకటన వివాదంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ (ఎన్‌సిడిఆర్‌సి) నుంచి ఊరట లభించింది. జైపూర్ జిల్లా కన్స్యూమర్ కమిషన్ సల్మాన్‌పై బెయిలబుల్ వారెంట్లు జారీ చేయడాన్ని ఎన్‌సిడిఆర్‌సి తీవ్రంగా తప్పుబట్టింది. అసలు ప్రకటన తప్పుదోవ పట్టించేలా ఉందా లేదా అనే ప్రాథమిక అంశాలను పరిశీలించకుండా వారెంట్లు జారీ చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. అలాగే ‘మిస్‌లీడింగ్ అడ్వర్టైజ్‌మెంట్’కు, ‘సర్రోగేట్ మార్కెటింగ్’కు మధ్య తేడాను గుర్తించడంలో జిల్లా కమిషన్ విఫలమైందని పేర్కొంది.

ఈ కేసు 2025లో న్యాయవాది యోగేంద్ర సింగ్ బడియాల్ దాఖలు చేసిన ఫిర్యాదుతో ప్రారంభమైంది. రాజశ్రీ పాన్ మసాలా ప్రకటనలో కుంకుమపువ్వు, యాలకులు ఉన్నట్లు చూపించి వినియోగదారులను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 2026 జనవరిలో జిల్లా కమిషన్ సల్మాన్‌కు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం సల్మాన్ తరఫు న్యాయవాది కోర్టుకు హాజరై, ఆ ప్రకటన పొగాకు లేని వెండి పూత పూసిన యాలకుల ఉత్పత్తికి సంబంధించినదేనని వివరించారు. అయినప్పటికీ జిల్లా కమిషన్ వారెంట్లు జారీ చేసి, సమ్మన్లు అందించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.

దీనిపై ఎన్‌సిడిఆర్‌సిని ఆశ్రయించిన సల్మాన్‌కు అనుకూలంగా కమిషన్ స్పందించింది. రాజస్థాన్ హైకోర్టు ఇప్పటికే తదుపరి చర్యలను నిలిపివేసినందున, హైకోర్టు తుది తీర్పు వచ్చే వరకు వేచి ఉండాలని జిల్లా కమిషన్‌ను ఆదేశిస్తూ పిటిషన్‌ను ముగించింది.

Related Articles