విరాట్ కర్ణ హీరోగా, అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాగబంధం’ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగబంధం, బ్రహ్మకమలం చుట్టూ సాగే కథలో రుద్ర (విరాట్ కర్ణ) ఓ రహస్యమైన ప్రయాణంలో ఎలా భాగమయ్యాడన్నదే సినిమా ప్రధానాంశం.
సినిమాలో ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా సాగుతుంది. నాగబంధం కాన్సెప్ట్, భారీ సెట్స్, విజువల్స్, ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ ఆకట్టుకుంటాయి. విరాట్ కర్ణ నటన, స్క్రీన్ ప్రెజెన్స్ బాగుండగా, నభ నటేష్, జగపతి బాబు, మురళీ శర్మ, గరుడ రామ్ తమ పాత్రలకు న్యాయం చేశారు.
అయితే సెకండ్ హాఫ్‌లో కథనం పూర్తిగా నెమ్మదిస్తుంది. సాగదీత, ఇప్పటికే చూసినట్లే అనిపించే సన్నివేశాలు, లాజిక్‌కు దూరంగా ఉండే కొన్ని ఎపిసోడ్లు సినిమాపై ప్రభావం చూపిస్తాయి. క్లైమాక్స్ ఫైట్ కూడా అవసరానికి మించి సాగిన భావన కలిగిస్తుంది. కొన్ని చోట్ల ఏఐ విజువల్స్ వాడకం కూడా నిరాశపరుస్తుంది.
సాంకేతికంగా నిర్మాణ విలువలు, కెమెరా పనితనం, ప్రొడక్షన్ డిజైన్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. అయితే బలమైన కాన్సెప్ట్‌కు తగ్గట్టుగా సెకండ్ హాఫ్‌ను మలచడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ కాలేకపోయారు. మొత్తంగా ‘నాగబంధం’ గ్రాండ్ విజువల్స్ కోసం ఒకసారి చూడదగిన ఫాంటసీ అడ్వెంచర్‌గా చెప్పొచ్చు.

