బండ్ల గణేష్ కేసులో హైకోర్టు కీలక తీర్పు

బండ్ల గణేష్ కేసులో హైకోర్టు కీలక తీర్పు

సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బకాయి రుణాల వసూళ్లలో భాగంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన కుటుంబానికి చెందిన ఆస్తిని యూనియన్ బ్యాంక్ వేలం వేయడాన్ని హైకోర్టు సమర్థించింది. రుణ వసూళ్ల ట్రైబ్యునల్ (డీఆర్‌టీ) గతంలో ఇచ్చిన వేలం రద్దు ఉత్తర్వులను రద్దు చేస్తూ, బ్యాంకు చేపట్టిన వేలం చట్టబద్ధమేనని స్పష్టం చేసింది.

శ్రీపరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్ తీసుకున్న రుణానికి బండ్ల గణేష్‌, ఆయన తండ్రి, సోదరుడు హామీదారులుగా ఉన్నారు. రుణం చెల్లించకపోవడంతో యూనియన్ బ్యాంక్ సర్ఫేసీ చట్టం కింద చర్యలు ప్రారంభించి, 2019లో ఆస్తిని స్వాధీనం చేసుకుంది. అనంతరం 2022లో జరిగిన బహిరంగ వేలంలో రూ.8.51 కోట్లకు విక్రయించింది.

విచారణలో వేలం పూర్తైన తర్వాత బండ్ల గణేష్‌ కుటుంబం రూ.82 కోట్ల వన్‌టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్)కు అంగీకరించిందని, తర్వాత వేలాన్ని సవాలు చేయడం సమంజసం కాదని బ్యాంకు వాదించింది. మరోవైపు, సంస్థపై ఎన్‌సీఎల్‌టీలో దివాలా పరిష్కార ప్రక్రియ కొనసాగుతున్నందున ఆస్తి విక్రయంపై మొరటోరియం వర్తిస్తుందని బండ్ల గణేష్‌ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు.

అయితే వేలం వేసిన ఆస్తి కంపెనీది కాదని, హామీదారుల వ్యక్తిగత ఆస్తి అని బ్యాంకు వివరించింది. కార్పొరేట్ దివాలా ప్రక్రియ వ్యక్తిగత గ్యారంటర్ల ఆస్తులకు వర్తించదని హైకోర్టు స్పష్టం చేస్తూ, డీఆర్‌టీ ఉత్తర్వులను కొట్టివేసి బ్యాంకు వేలాన్ని చట్టబద్ధంగా ప్రకటించింది.

Related Articles