దర్శకుడు వెంకీ అట్లూరి చేసిన తాజా వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సూర్య నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు చిత్రసీమ వర్కింగ్ కల్చర్‌పై ఆయన స్పందించారు. హిందీ చిత్రసీమతో పోలిస్తే తెలుగు ఇండస్ట్రీలో పని విధానం క్రమశిక్షణతో ఉంటుందని వెంకీ అట్లూరి చెప్పారు. ఉదయం 8 గంటలకు షూటింగ్ ప్రారంభమవుతుందని, టెక్నీషియన్లు ముందుగానే సెట్స్‌కు చేరుకుంటారని తెలిపారు. సాధారణంగా రోజుకు 11 నుంచి 12 గంటల వరకు షూటింగ్ జరుగుతుందని, నటీనటులు కూడా ఎక్కువ సమయం సెట్స్‌లో ఉంటారని వెల్లడించారు.
తాను ఇతర భాషల్లో సినిమా చేస్తే అక్కడి వర్కింగ్ కల్చర్‌కు అనుగుణంగా పనిచేస్తానని, అలాగే తెలుగు చిత్రసీమకు వచ్చే ఇతర భాషల నటీనటులు, టెక్నీషియన్లు కూడా ఇక్కడి పనివిధానాన్ని గౌరవించి దానికి అనుగుణంగా వ్యవహరించాలని అన్నారు.
వెంకీ అట్లూరి వ్యాఖ్యలు బాలీవుడ్ నటి దీపికా పదుకొణె గతంలో చేసిన 8 గంటల షూటింగ్ షిఫ్ట్ వ్యాఖ్యలకు పరోక్ష సమాధానంగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దీంతో తెలుగు, హిందీ చిత్రసీమల వర్కింగ్ కల్చర్‌పై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది.

