ప్రముఖ పాండవాని గాయని, పద్మ విభూషణ్ గ్రహీత తీజన్ బాయి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం తెల్లవారుజామున రాయ్‌పూర్ ఎయిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 70 సంవత్సరాలు. తీజన్ బాయి మరణంతో భారత జానపద కళారంగం ఓ గొప్ప కళాకారిణిని కోల్పోయింది. ఛత్తీస్‌గఢ్ జానపద సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన అరుదైన కళాకారిణిగా ఆమె గుర్తింపు పొందారు.
1956 ఏప్రిల్ 24న ఛత్తీస్‌గఢ్‌లోని గనియారి గ్రామంలో జన్మించిన తీజన్ బాయి, చిన్న వయసులోనే పాండవాని కళపై ఆసక్తి పెంచుకున్నారు. తాత బ్రిజ్‌లాల్ పార్థి వద్ద తొలి ప్రేరణ పొందిన ఆమె, అనంతరం గురువు ఉమెద్ సింగ్ దేశ్‌ముఖ్ వద్ద శిక్షణ తీసుకున్నారు. మహాభారత కథలను సంగీతం, అభినయం, కథనంతో వినిపించే పాండవాని కళకు ఆమె తనదైన శైలితో కొత్త గుర్తింపు తీసుకొచ్చారు. ఒకప్పుడు పురుషుల ఆధిపత్యంలో ఉన్న ఈ కళలో మహిళగా రాణించి సామాజిక అడ్డంకులను అధిగమించారు. దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి పాండవాని కళకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చారు. ఆమె సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలతో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులతో సత్కరించింది.

