సీనియర్ నటి ఖుష్బూ సుందర్ కుమార్తె అవంతిక వివాహం ఇటీవల గోవాలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే తనకు మాత్రం ఆహ్వానం రాలేదంటూ సీనియర్ నటుడు రాధా రవి బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాధా రవి, ఖుష్బూ, ఆమె భర్త సుందర్.సితో తమ కుటుంబానికి దశాబ్దాల అనుబంధం ఉన్నప్పటికీ పెళ్లికి పిలవలేదని చెప్పారు. “పిలవని కార్యక్రమానికి వెళ్లడం నాకు అలవాటు లేదు. ఖుష్బూ కాకపోయినా సుందర్.సి అయినా ఆహ్వానిస్తారని భావించాను. కానీ ఎలాంటి పిలుపు రాలేదు” అని అన్నారు.
అలాగే గతంలో సుందర్.సి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తనవంతు సహాయం చేసి, ప్రచారం కూడా చేశానని గుర్తు చేశారు. “బహుశా నా అవసరం తీరిపోయి ఉండొచ్చు. అందుకే ఇప్పుడు నన్ను గుర్తు పెట్టుకోలేదేమో. ఆహ్వానించి ఉంటే తప్పకుండా వెళ్లేవాడిని” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఖుష్బూ, రాధా రవి కలిసి ‘చిన్న తంబి’, ‘అన్నామలై’, ‘మన్నన్’ వంటి చిత్రాల్లో నటించారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.

