‘లాపతా లేడీస్’ చిత్రంతో గుర్తింపు పొందిన యువ నటుడు సతేంద్ర సోని బాలీవుడ్‌లో సంచలన ఆరోపణలు చేశారు. మధ్యప్రదేశ్‌లో జరుగుతున్న ‘పేడ్ పాల్కి’ సినిమా షూటింగ్ సందర్భంగా దర్శకుడు తనపై దాడి చేయడమే కాకుండా చంపేస్తామని బెదిరించాడని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ ఘటన ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మధ్యప్రదేశ్‌లోని మైహర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పుష్పేంద్ర సింగ్ దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. షూటింగ్ ప్రారంభానికి ముందు రూ.50 వేల అడ్వాన్స్ ఇచ్చి, మిగిలిన పారితోషికాన్ని షూటింగ్ సమయంలో చెల్లిస్తామని హామీ ఇచ్చారని సతేంద్ర తెలిపారు. మొత్తం 10 రోజుల షెడ్యూల్‌లో ఎనిమిది రోజుల పాటు పనిచేసిన తర్వాత రెమ్యునరేషన్ గురించి అడగగా పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని చెప్పారు.
డబ్బులు ఇవ్వకుండా వెంటనే హోటల్ ఖాళీ చేయాలని, లేకపోతే చంపేస్తామని దర్శకుడు బెదిరించాడని ఆయన ఆరోపించారు. దర్శకుడు పుష్పేంద్ర సింగ్‌తో పాటు ఆయన భార్య, నటి ప్రగతి చౌహాన్ కూడా తనను అవమానించారని పేర్కొన్నారు. దీంతో సహనటులు శ్రీధర్ దూబే, పంకజ్ శర్మతో కలిసి హోటల్‌ను విడిచిపెట్టినట్లు వెల్లడించారు.
అయితే అక్కడితో వివాదం ముగియలేదని, కారులో వెంబడించి నడిరోడ్డుపై తనపై దాడి చేశారని సతేంద్ర ఆరోపించారు. తనను రక్షించేందుకు వచ్చిన సహనటుడు శ్రీధర్ దూబేపై కూడా దాడి జరిగినట్లు తెలిపారు. సినిమా యూనిట్‌లోని పలువురు నటీనటులకు, సాంకేతిక సిబ్బందికి కూడా పూర్తి పారితోషికం అందలేదని ఆయన ఆరోపించారు.
ఈ ఘటన అనంతరం ముంబై చేరుకున్న సతేంద్ర మరో వీడియో విడుదల చేసి తాను ప్రస్తుతం సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తమకు సహకరించిన మధ్యప్రదేశ్ పోలీసులకు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, సతేంద్ర సోని గతంలో ‘డాక్టర్ జీ’, ‘బవాల్’, ‘రాత్ అకేలీ హై’ వంటి చిత్రాలతో పాటు ‘హలో బచ్చోన్’ టెలివిజన్ కార్యక్రమంలోనూ నటించి ప్రేక్షకులకు చేరువయ్యారు. ప్రస్తుతం ఆయన చేసిన ఆరోపణలు బాలీవుడ్‌లో చర్చకు దారితీశాయి.

