‘రణబాలి’పై విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

‘రణబాలి’పై విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రణబాలి’ చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. రాహుల్ సాంకృత్యాన్ పుట్టినరోజు సందర్భంగా విజయ్ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తూ, తమ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.

‘టాక్సీవాలా’ విడుదలై తొమ్మిదేళ్లు పూర్తయ్యాయని, ఈ కాలంలో ఇద్దరూ ఎంతో ఎదిగినా మంచి కథలు చెప్పాలనే రాహుల్ తపన, పాత్రలకు న్యాయం చేయాలనే తన కట్టుబాటు మాత్రం మారలేదని విజయ్ పేర్కొన్నారు. తాము కలిసి చేసిన రెండు సినిమాల కోసం ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని, అన్ని అడ్డంకులను అధిగమించి విడుదలైన ‘టాక్సీవాలా’ ప్రేక్షకుల ఆదరణ పొందిందని గుర్తుచేశారు.

ఇప్పుడు ‘రణబాలి’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని, ఈ సినిమా కూడా విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేశారు. రాహుల్ సాంకృత్యాన్ సినిమాలో భాగమవడం తన అదృష్టమని, ఆయన ప్రతిభను మరోసారి ప్రేక్షకులు చూడబోతున్నారని విజయ్ తెలిపారు. విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ‘రణబాలి’ చిత్రం 1854 –1878 మధ్య జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతోంది. ఈ సినిమా సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles