ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీపై క్లారిటీ

ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీపై క్లారిటీ

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ, జులై 18న కీలక ప్రకటన చేయనున్నారనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిమాన సంఘాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుడతారనే ప్రచారం కూడా జోరుగా సాగింది. అయితే ఈ వార్తలపై ఎన్టీఆర్ టీమ్ అధికారికంగా స్పందిస్తూ పూర్తి స్పష్టత ఇచ్చింది.

టీమ్ విడుదల చేసిన ప్రకటనలో జులై 18న ఎలాంటి రాజకీయ ప్రకటన ఉండదని తేల్చిచెప్పింది. ఆ రోజు నిర్వహించబోయే కార్యక్రమం ‘ఊరు వాడ’ పేరుతో ముందుగానే ప్రణాళిక చేసిన సామాజిక కార్యక్రమమని వెల్లడించింది. ఈ కార్యక్రమం లక్ష్యం, ఉద్దేశ్యం, విజన్‌ను ప్రజలకు పరిచయం చేయడమే గానీ, దీనికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

అలాగే కార్యక్రమానికి సంబంధించిన వేదిక, సమయం, పూర్తి వివరాలను త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడిస్తామని తెలిపింది. ఇక ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయవద్దని మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, సోషల్ మీడియా ఖాతాలకు ఎన్టీఆర్ టీమ్ విజ్ఞప్తి చేసింది. అధికారిక సమాచారం ఆధారంగానే వార్తలు ప్రచురించాలని కోరింది. తప్పుడు ప్రచారం వల్ల అభిమానుల్లో అనవసర గందరగోళం ఏర్పడుతుందని పేర్కొంది.

గతంలో 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎన్టీఆర్ ప్రచారం చేయడం, అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కావడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ ఊహాగానాలు మళ్లీ తెరపైకి వచ్చినప్పటికీ, తాజా ప్రకటనతో రాజకీయ ఎంట్రీపై వస్తున్న ప్రచారానికి ఎన్టీఆర్ టీమ్ చెక్ పెట్టింది.

Related Articles