దక్షిణ భారతదేశంలోని ప్రముఖ మల్టీప్లెక్స్ బ్రాండ్లలో ఒకటైన ఏఎంబీ సినిమాస్ మరో ప్రతిష్టాత్మక అడుగు వేయబోతోంది. హైదరాబాద్‌లో నిర్మితమవుతున్న ఏఎంబీ క్లాసిక్ విక్టరీ మల్టీప్లెక్స్‌లో తెలుగు రాష్ట్రాల్లోనే ఏకైక ఐమ్యాక్స్ స్క్రీన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏషియన్ గ్రూప్ అధినేతలు సునీల్ నారంగ్, భరత్ నారంగ్‌ల భాగస్వామ్యంతో ఏర్పడిన ఏఎంబీ సినిమాస్ ఇప్పటికే డాల్బీ సినిమా, హెచ్‌డీఆర్ బై బార్కో వంటి అత్యాధునిక సాంకేతికతలను పరిచయం చేసి ప్రత్యేక గుర్తింపు పొందింది.
ఇప్పుడు అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందిన సుదర్శన్ 70 ఎంఎం ప్రాంగణంలో నిర్మితమవుతున్న ఈ మల్టీప్లెక్స్, అత్యాధునిక సాంకేతికతతో ప్రేక్షకులకు ప్రపంచ స్థాయి సినిమా అనుభూతిని అందించనుంది. త్వరలో ప్రారంభం కానున్న ఏఎంబీ క్లాసిక్ విక్టరీ హైదరాబాద్ సినీ అభిమానులకు కొత్త గమ్యస్థానంగా మారనుంది.

