కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు సినీ ప్రముఖులు సోమవారం తిరుమలకు చేరుకున్నారు. ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తమిళ నటుడు మాధవన్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.
నాగార్జునతో పాటు ఆయన సతీమణి అమల, కుమారుడు అఖిల్, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, నటుడు సునీల్, నిర్మాత నాగవంశీ స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వీరికి వేద ఆశీర్వచనం అందించి, శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అఖిల్ హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలు తిరుపతిలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే చిత్రబృందం శ్రీవారి ఆశీస్సులు తీసుకుంది.
ఇదిలా ఉండగా, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. ఆదివారం 88,412 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 31,273 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.5.05 కోట్లుగా నమోదైంది. అలాగే 4.24 లక్షల లడ్డూలను విక్రయించగా, అంతే సంఖ్యలో భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

