మోహన్‌లాల్ కేసు.. మళ్లీ వార్తల్లోకి

మోహన్‌లాల్ కేసు.. మళ్లీ వార్తల్లోకి

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌పై కొనసాగుతున్న ఏనుగు దంతాల అక్రమ నిల్వ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేరళ హైకోర్టు విచారణలో భాగంగా ఆయన గతంలో ఆదాయపు పన్ను శాఖకు సమర్పించిన వాలంటరీ డిస్‌క్లోజర్ పత్రాలు న్యాయస్థానం ముందుకు వచ్చాయి.

ఆ పత్రాల ప్రకారం మోహన్‌లాల్ వద్ద నాలుగు ఏనుగు దంతాలు మాత్రమే కాకుండా, మొత్తం 10 ఏనుగు దంతాలు, వాటితో తయారు చేసిన 13 కళాఖండాలు ఉన్నట్లు ఆయన స్వయంగా ప్రకటించినట్టు తెలుస్తోంది. దీంతో ఈ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.

2011 జూన్‌లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు మోహన్‌లాల్ నివాసం, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొచ్చిలోని ఆయన ఇంట్లో నాలుగు ఏనుగు దంతాలను గుర్తించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టాల ప్రకారం అవసరమైన అనుమతులు లేకుండా ఇలాంటి వస్తువులను కలిగి ఉండటం నేరం కావడంతో కేరళ అటవీ శాఖ ఆయనపై కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి ఈ వ్యవహారం కోర్టు పరిధిలో కొనసాగుతోంది.

మోహన్‌లాల్ తరపు న్యాయవాదులు మాత్రం ఆయన ఎలాంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడలేదని వాదిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక ‘ఐవరీ అమ్నెస్టీ’ పథకం కిందే ఈ వివరాలను ముందుగానే వెల్లడించామని కోర్టుకు తెలిపారు.

అయితే ఐటీ శాఖకు సమాచారం ఇచ్చినప్పటికీ, అటవీ చట్టాల ప్రకారం ఏనుగు దంతాలను కలిగి ఉండేందుకు అవసరమైన అధికారిక యాజమాన్య ధ్రువీకరణ పత్రాన్ని మోహన్‌లాల్ సకాలంలో పొందారా లేదా అన్న అంశంపైనే ప్రస్తుతం కేరళ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ అంశంపై కోర్టు తీసుకునే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.

Related Articles