‘లెనిన్’ సినిమాతో తొలి విజయాన్ని అందుకున్న నటి భాగ్యశ్రీ బోర్సే తన సినీ ప్రయాణం, విజయాలు –పరాజయాలు, భవిష్యత్ లక్ష్యాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తొలి విజయం ఎప్పటికీ ప్రత్యేకమేనని, అందుకే సినిమా విజయోత్సవ వేడుకలో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నానని తెలిపారు. ‘‘ఈ పరిశ్రమలో స్థిరపడాలనే లక్ష్యంతో వచ్చాను. విజయం మరింత కష్టపడేలా ప్రోత్సహిస్తుంది. ‘లెనిన్’తో వచ్చిన తొలి సక్సెస్ నాకు చాలా ప్రత్యేకం. మళ్లీ విజయాలు రావొచ్చు కానీ తొలి విజయానందం మాత్రం తిరిగి రాదు’’ అని అన్నారు.
విజయం అంటే బాక్సాఫీస్ వసూళ్లు కాదని, ఒక నటిగా తన పాత్రకు పూర్తిగా న్యాయం చేయడమే అసలైన సక్సెస్ అని చెప్పారు. ‘‘ప్రేక్షకులు తెరపై భాగ్యశ్రీని కాకుండా నేను చేసిన పాత్రనే చూడాలి. ఒకవేళ నా నటనలో లోపం ఉందని ఎవరైనా చెబితే దాన్ని అంగీకరిస్తాను. కానీ సినిమా ఫెయిల్ అయితే హీరోయిన్లనే నిందించడం సరికాదు’’ అని స్పష్టం చేశారు.
తన కెరీర్ ప్రారంభంలోనూ ‘ఐరన్ లెగ్’, ‘అన్‌లక్కీ’ వంటి విమర్శలు ఎదుర్కొన్నానని గుర్తుచేసుకున్నారు. ‘‘సినిమా ఎడిటింగ్, కథలో మార్పులు, తుది నిర్ణయాలు హీరోయిన్ల చేతుల్లో ఉండవు. అలాంటప్పుడు సినిమా ఫలితానికి ఒక్క హీరోయిన్‌ను బాధ్యురాలిగా చూడడం సరైంది కాదు’’ అని అభిప్రాయపడ్డారు.
అమితాబ్ బచ్చన్, శివ కార్తికేయన్ వంటి నటులు కూడా తమ కెరీర్‌లో ఒడిదొడుకులు ఎదుర్కొని తిరిగి నిలబడ్డారని చెప్పారు. ‘‘విజయం ఆలస్యంగా వస్తే కెరీర్ ఎక్కువకాలం నిలుస్తుందని నా సీనియర్లు చెప్పిన మాటను నేను నమ్ముతాను’’ అన్నారు.
కథల ఎంపికలో తన అంతరాత్మ చెప్పిందే వింటానని, ‘లెనిన్’ కథ తొలుత తనకే వచ్చినా డేట్లు కుదరక వదులుకోవాల్సి వచ్చిందని, చివరకు మళ్లీ తనకే రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.
మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తనకు కుటుంబ ఆర్థిక ఇబ్బందులే ప్రేరణగా నిలిచాయని చెప్పారు. భవిష్యత్‌లో రాజమౌళి దర్శకత్వంలో నటించాలని కోరిక ఉందని, అలాగే ఒకరోజు దర్శకురాలిగా కూడా మారాలని ఆశిస్తున్నట్లు భాగ్యశ్రీ బోర్సే వెల్లడించారు.

