బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలకు ఆయనే స్వయంగా ఫుల్స్టాప్ పెట్టారు. ఇటీవల తన బ్లాగ్లో శస్త్రచికిత్స తర్వాత కోలుకునే ప్రక్రియ గురించి చేసిన వ్యాఖ్యలను చాలామంది తన ఆరోగ్యానికి అన్వయించుకోవడంతో సర్జరీ జరిగిందనే ప్రచారం మొదలైంది. అయితే, “నాకు ఎలాంటి శస్త్రచికిత్స జరగలేదు. నేను పూర్తిగా ఆరోగ్యంగానే ఉన్నాను” అంటూ అమితాబ్ స్పష్టం చేశారు. తాను రాసింది కేవలం ఒక ఉదాహరణ మాత్రమేనని, అర్జెంటీనా– స్పెయిన్ ఫిఫా మ్యాచ్ నేపథ్యంలో ఓటమి తర్వాత తిరిగి నిలబడటం ఎంత కష్టమో చెప్పేందుకు ఆ పోలికను ఉపయోగించానని వివరించారు. కానీ, దానిని తన ఆరోగ్యానికి సంబంధించిన విషయంగా అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు.
అమితాబ్ వివరణతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, త్వరలోనే ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘కల్కి’ సీక్వెల్ షూటింగ్లో పాల్గొననున్నట్లు వెల్లడించారు. 83 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతున్న బిగ్ బీకి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

