కమర్షియల్ ఎంటర్‌టైనర్లతో ప్రేక్షకులను అలరిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు తొలిసారిగా హారర్ జోనర్‌లో అడుగుపెడుతోంది. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న ‘418’ సినిమాని జులై 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
ఈ సినిమాకి కీర్తన్ నాదగౌడ దర్శకత్వం వహిస్తుండగా, సోషల్ మీడియా, ఇంటర్నెట్ ప్రపంచంలో మంచి గుర్తింపు పొందిన ప్రీతి పగడాల హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమెతో పాటు చరణ్ లక్కరాజు, సూర్య రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త తరహా హారర్ అనుభూతిని అందించనున్నట్లు మేకర్స్ చెబుతున్నారు.
విడుదల తేదీ ప్రకటనతో పాటు చిత్ర బృందం విడుదల చేసిన కొత్త పోస్టర్ కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముంగురులు తిరిగిన పొడవాటి జుట్టుతో వెనక్కి తిరిగి కూర్చున్న యువతి బ్యాక్ లుక్ పోస్టర్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచింది. హారర్, సస్పెన్స్ అంశాలు ప్రధాన ఆకర్షణగా ఉండనున్నట్లు పోస్టర్ సూచిస్తోంది.
ఈ సినిమాకి దినేష్ దినకరన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, వెంకీ జీజీ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రశాంత్ నీల్ సమర్పణలో వస్తున్న ఈ హారర్ మూవీపై ఇప్పటికే సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

