సోషల్ మీడియాకు గుడ్‌బై: ఐశ్వర్య

సోషల్ మీడియాకు గుడ్‌బై: ఐశ్వర్య

‘గట్టా కుస్తీ 2’ విజయంతో మంచి జోష్‌లో ఉన్న నటి ఐశ్వర్య లక్ష్మి ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె సోషల్ మీడియా, ఫెమినిజం, కామెడీ పాత్రలు, తన కొత్త ప్రాజెక్టుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘గట్టా కుస్తీ 2’ విజయానికి అసలు ప్రమాణం బాక్సాఫీస్ కలెక్షన్లు కాదని, ప్రేక్షకులు థియేటర్లలో నవ్వుతూ సినిమాను ఆస్వాదించడమే నిజమైన విజయమని ఆమె అన్నారు. ఈ సినిమా హాస్యంతో పాటు మహిళా సాధికారతను ప్రతిబింబించే కథతో రూపొందిందని, భార్య కలను నెరవేర్చేందుకు భర్త అండగా నిలిచే సందేశమే సినిమా ప్రధాన అంశమని చెప్పారు. కామెడీ పాత్రలు చేయడం తనకు చాలా ఇష్టమని, అయితే ఆ విభాగంలో ఇంకా మెరుగుపడాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.

సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ, తాను ఎప్పుడూ అక్కడ సురక్షితంగా అనిపించుకోలేదని చెప్పారు. గతంలో తన ఫొటోలను మార్ఫ్ చేయడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల సోషల్ మీడియా నుంచి పూర్తిగా దూరమైనట్లు తెలిపారు. ప్రస్తుతం తిరిగి సోషల్ మీడియాలోకి రావాలనే ఆలోచనే లేదని, రోజుకు రూ.100 కోట్లు ఇచ్చినా సోషల్ మీడియా ఉపయోగించనని స్పష్టం చేశారు. తన పెంపుడు కుక్క ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా మాత్రమే సినిమా అప్‌డేట్స్ చూస్తానని చెప్పారు.

ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి ఓ మహిళా ప్రధాన తమిళ సినిమాలో పోలీస్ అధికారిణిగా నటిస్తున్నారు. అలాగే ‘తీవినయ్ పొట్రు’, ‘లవ్’ వెబ్ సిరీస్‌లతో పాటు బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.

Related Articles