ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో వేగంగా విస్తరిస్తుండగా, ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమలోనూ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది. పూర్తిగా ఫొటో రియలిస్టిక్ ఏఐ టెక్నాలజీ ఆధారంగా రూపొందుతున్న ‘అవిరా’ సినిమా భారతీయ సినిమా చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకి ప్రభాకరన్ కథ, కథనం, సంభాషణలు, దర్శకత్వంతో పాటు ఏఐ సాంకేతిక బాధ్యతలను కూడా స్వయంగా నిర్వహిస్తున్నారు. గతంలో 70కి పైగా వాణిజ్య ప్రకటనలను రూపొందించిన అనుభవంతో ఆయన ఈ వినూత్న ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. పూర్తిస్థాయి ఫొటో రియలిస్టిక్ ఏఐ సాంకేతికతతో రూపొందుతున్న తొలి భారతీయ సినిమాగా ‘అవిరా’ నిలుస్తుందని చిత్ర బృందం తెలిపింది.
పురాణ కథలకు ఫాంటసీ అంశాలను జోడించి రూపొందిస్తున్న ఈ సినిమాలో పాత్రలు, దృశ్యాలు, విజువల్ ప్రపంచాన్ని ఏఐ సాంకేతికతతో సృష్టిస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు. సాంకేతిక నైపుణ్యంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే వినోదాత్మక కథను అందించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. ప్రస్తుతం చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిన వెంటనే విడుదల తేదీని ప్రకటించనున్నట్లు తెలిపారు.
లైట్ హౌస్ ఫిలిం కంపెనీ పతాకంపై గణేష్, జగదీష్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలో ఏఐ సాంకేతికత వినియోగానికి ‘అవిరా’ కొత్త దారిని చూపించే సినిమాగా నిలుస్తుందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

