బాలీవుడ్ నటి మౌనీరాయ్ ఇటీవల ముంబైలో జరిగిన ఓ ఘటనపై స్పందిస్తూ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ఇటీవల ఓ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చిన ఆమె కారులో కూర్చున్న తర్వాత కూడా ఫొటోగ్రాఫర్లు కారు అద్దాల గుండా ఫొటోలు తీయడానికి ప్రయత్నించారు. దీంతో అసౌకర్యానికి గురైన మౌనీరాయ్ వారిని అక్కడికక్కడే ఆపాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మౌనీరాయ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, ‘‘ఫొటోగ్రాఫర్లంటే నాకు ఎంతో గౌరవం ఉంది. అయితే దయచేసి నా ఫొటోలు తీయకండి. చాలా కాలంగా నేను మిమ్మల్ని పిలవడం లేదు. ఇకపై కూడా పిలవను. నాకోసం ప్రత్యేకంగా రావాల్సిన అవసరం లేదు. మీపై గౌరవంతోనే ఈ మాటలు చెబుతున్నాను’’ అని పేర్కొన్నారు.
అయితే ఈ పోస్ట్‌ను కొద్దిసేపటికే ఆమె తొలగించినప్పటికీ, అప్పటికే దాని స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. కొందరు ఆమె వ్యాఖ్యలను విమర్శిస్తుండగా, మరికొందరు సెలబ్రిటీలకు కూడా వ్యక్తిగత గోప్యత హక్కు ఉంటుందని చెబుతూ మౌనీరాయ్‌కు మద్దతు తెలిపారు.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం మౌనీరాయ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమాలో ప్రత్యేక గీతంలో కనిపించనున్నారు. అలాగే దర్శకుడు మధుర్ భండార్కర్ రూపొందిస్తున్న ‘ది వైవ్స్’ సినిమాలోనూ కీలక పాత్రలో నటిస్తున్నారు.

