మూడేళ్లుగా తోడుగా ఉంటున్న జైనబ్: అఖిల్

మూడేళ్లుగా తోడుగా ఉంటున్న జైనబ్: అఖిల్

హీరో అక్కినేని అఖిల్ నటించిన ‘లెనిన్’ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో గుంటూరులో చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అఖిల్, సినిమా విజయానికి సహకరించిన చిత్రబృందం, అభిమానులు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా తన భార్య జైనబ్ గురించి మాట్లాడిన ఆయన భావోద్వేగ వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయి. ‘‘నేను జైనబ్‌ను ఇంట్లో ‘బంగారు తల్లి’ అని పిలుస్తాను. గత మూడేళ్లుగా నా జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదురయ్యాయి. ఆ సమయంలో ఆమె ప్రతి అడుగులోనూ నాకు అండగా నిలిచింది. నన్ను ధైర్యపరుస్తూ, ఒక గైడ్‌లా ముందుకు నడిపించింది. ఆమె సహకారం ఎప్పటికీ మర్చిపోలేను’’ అని అఖిల్ అన్నారు.

తన తండ్రి నాగార్జున గురించి కూడా అఖిల్ భావోద్వేగంగా మాట్లాడారు. ‘‘లెనిన్ విడుదల తర్వాత జరిగిన ఈవెంట్‌లో నాన్నను హగ్ చేసుకున్నప్పుడు పదేళ్లుగా మనసులో దాచుకున్న భావోద్వేగాలన్నీ ఒక్కసారిగా బయటకు వచ్చాయి. ఇన్నేళ్లలో ఆయన నన్ను ఎప్పుడూ నిరుత్సాహపరచలేదు. నాకు తండ్రిగానే కాదు, మంచి స్నేహితుడిలా కూడా అండగా నిలిచారు’’ అని తెలిపారు.

అభిమానుల గురించి మాట్లాడుతూ, ‘‘ఇలాంటి అభిమానులు దొరకడం నిజంగా అదృష్టం. వారి కోసం అయినా మంచి విజయం సాధించాలని ఎప్పుడూ అనుకునేవాడిని. ఈ విజయంతో గర్వపడకుండా మరింత బాధ్యతతో ముందుకు సాగుతాను. ఇప్పటి నుంచి నా కొత్త ప్రయాణం ప్రారంభమవుతోంది’’ అని అఖిల్ పేర్కొన్నారు.

Related Articles