దళపతి విజయ్ నటిస్తున్న చివరి సినిమా ‘జననాయగన్’ విడుదల నేపథ్యంలో పలువురు నిర్మాతలు తమ సినిమాల విడుదల తేదీలను మార్చుకుంటున్నట్లు కోలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సిగ్మా’ కూడా వాయిదా పడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సందీప్ కిషన్ హీరోగా రూపొందుతున్న హై- ఓల్టేజ్ హీస్ట్ ఎంటర్టైనర్ ‘సిగ్మా’ను తొలుత జులై 31న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే అదే సమయంలో ‘జననాయగన్’ విడుదల కానుండటంతో కలెక్షన్లపై ప్రభావం పడకుండా ఉండేందుకు ‘సిగ్మా’ను ఆగస్టుకు వాయిదా వేసినట్లు సమాచారం. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే, రాజకీయాల్లో పూర్తిస్థాయిలో అడుగుపెట్టే ముందు విజయ్ నటిస్తున్న చివరి సినిమా కావడంతో ‘జననాయగన్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా, బాబీ డియోల్ కీలక పాత్ర పోషించారు. ఇటీవల సెన్సార్ ప్రక్రియ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

