దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజాగా విడుదలైన ‘రావు బహదూర్’ సినిమాపై ప్రశంసలు కురిపించారు. సినిమా చూసిన అనంతరం సోషల్ మీడియాలో స్పందించిన ఆయన, ఈ సినిమాని ప్రేక్షకులు తప్పకుండా చూడాల్సిన అరుదైన సినిమా అని పేర్కొన్నారు. ‘‘మనం సినిమాను ఎందుకు ప్రేమిస్తామో మరోసారి గుర్తుచేసే సినిమా ‘రావు బహదూర్’. ప్రతి సినీప్రేమికుడు తన జీవితంలో మూడు గంటలు ఈ సినిమాకి కేటాయించాలి. ఇది అన్ని ప్రశంసలకు అర్హమైన సినిమా’’ అని ఆయన అన్నారు.
దర్శకుడు వెంకటేష్ మహా తక్కువ బడ్జెట్లో అద్భుతమైన సినిమాని తెరకెక్కించారని, అలాంటి సినిమా చేయాలంటే ధైర్యం, ఆత్మవిశ్వాసం అవసరమని కొనియాడారు. హీరో సత్యదేవ్ నటన అద్భుతంగా ఉందని, సినిమాలో అనవసరమైన హడావుడి లేదా షార్ట్కట్లు లేకుండా స్వచ్ఛమైన కథను చూపించారని ప్రశంసించారు. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరించాలని సూచించారు.
వెంకటేష్ మహా దర్శకత్వంలో రూపొందిన ‘రావు బహదూర్’ ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఇప్పటికే మహేష్ బాబు, నాగచైతన్యలతో సహా పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాని, సత్యదేవ్ నటనను ప్రశంసించారు.

