జానకికి సుశీల భావోద్వేగ నివాళి

జానకికి సుశీల భావోద్వేగ నివాళి

భారతీయ సంగీత ప్రపంచాన్ని తన మధుర గానంతో దశాబ్దాల పాటు అలరించిన దిగ్గజ గాయని ఎస్. జానకి మరణం సంగీతాభిమానులను విషాదంలోకి నెట్టింది. ఈ నేపథ్యంలో ప్రముఖ గాయని పి. సుశీల జానకమ్మను స్మరించుకుంటూ చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జానకితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సుశీల, “మద్రాస్‌లో మేం ఇద్దరం రెండు పర్వతాల్లా ఉండేవాళ్లం. జానకి అసాధారణ ప్రతిభ కలిగిన గాయని. ఆమె పాడిన తీరు, ప్రతి పాటలో చూపించిన వైవిధ్యం అద్భుతం. అలాంటి గొంతు మళ్లీ రావడం చాలా కష్టం” అని అన్నారు.

తన పేరుతో ఏర్పాటు చేసిన తొలి అవార్డును జానకికే అందించడం తన జీవితంలో చేసిన గొప్ప పనుల్లో ఒకటని సుశీల చెప్పారు. జానకి మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని, ఆమె ఏ గొంతునైనా అలవోకగా అనుకరించి, ప్రతి భావాన్ని అద్భుతంగా వ్యక్తపరచగలిగే అరుదైన గాయని అని కొనియాడారు. గతంలో తమ ఇద్దరి మధ్య పోటీ, విభేదాలు ఉన్నాయని ప్రచారం చేసిన వారిపైనా సుశీల పరోక్షంగా స్పందించారు. “నా గురించి ఆమెకు, ఆమె గురించి నాకు చెప్పి కొందరు ఆనందపడ్డారు. ఇప్పుడు వాళ్లు ఏం సాధించారు? జానకి తన జీవితంలో అన్నీ సాధించింది” అని వ్యాఖ్యానించారు.

చివరిగా జానకికి భావోద్వేగంగా నివాళులర్పిస్తూ, “సరస్వతీ దేవి సంగీత కచేరీ కోసం జానకిని తన దగ్గరకు పిలిచి ఉండొచ్చు. అలాంటి అదృష్టం అందరికీ దక్కదు. జానకమ్మకు శారీరకంగా మరణం ఉండొచ్చు కానీ ఆమె గానానికి మాత్రం మరణం లేదు. ఆమె గొంతు ఎప్పటికీ సంగీత ప్రపంచంలో మారుమోగుతూనే ఉంటుంది” అని సుశీల అన్నారు. ఆమె మాటలు అభిమానులను కదిలిస్తున్నాయి.

Related Articles