పెళ్లికొడుకుకు గతం గుర్తుకురాదు!

పెళ్లికొడుకుకు గతం గుర్తుకురాదు!

ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునే వేళ ప్రమాదంలో జ్ఞాపకశక్తి కోల్పోయిన యువకుడి కథతో తెరకెక్కిన వెబ్‌సిరీస్ ‘గుర్తుకొస్తున్నాయి’. హాస్యం, స్నేహం, ప్రేమ, భావోద్వేగాలను సమపాళ్లలో మేళవించిన ఈ సిరీస్ ఇప్పటికే ఈటీవీ విన్‌లో మంచి ఆదరణ పొందుతోంది. కథలో సంతోష్ (విరాజ్ అశ్విన్), చిన్నప్పటి నుంచి ప్రేమించిన వైశాలి (యశశ్రీ రావు)తో పెళ్లికి సిద్ధమవుతాడు. అయితే బ్యాచిలర్ పార్టీ సందర్భంగా జరిగిన ప్రమాదంతో అతడు గతాన్ని మర్చిపోతాడు. ఈ విషయం వధువు కుటుంబానికి తెలియకుండా, పెళ్లికి ముందే అతనికి జ్ఞాపకాలు తిరిగి వచ్చేలా చేయడానికి స్నేహితులు, కుటుంబ సభ్యులు చేసే ప్రయత్నాలే కథకు ప్రధాన ఆకర్షణ.

మతిమరుపు కథాంశం కొత్తది కాకపోయినా, దాన్ని 90ల జ్ఞాపకాలు, చిన్ననాటి స్నేహాలు, ప్రేమ, కుటుంబ అనుబంధాలతో దర్శకుడు వినోద్ గాలి హృద్యంగా చూపించారు. తొలి నాలుగు ఎపిసోడ్‌లు వినోదంతో నవ్విస్తే, చివరి మూడు ఎపిసోడ్‌లు భావోద్వేగాలతో ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ హృదయాలను కదిలిస్తుంది.

విరాజ్ అశ్విన్ సహజమైన నటనతో మెప్పించగా, వైవా రాఘవ, పవన్ సిద్ధు, గోదావరి గోపి, శివన్నారాయణ తమ కామెడీ టైమింగ్‌తో అలరించారు. నవ్వులు, ఎమోషన్స్ కలగలిపిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కోసం చూస్తున్న వారికి ‘గుర్తుకొస్తున్నాయి’ మంచి చాయిస్.

Related Articles